Pages

Saturday, October 1, 2011

రాష్ట్రం వచ్చేదాక సమ్మె ఆగదు --- కేసీఆర్ ప్రకటన


- ప్రభుత్వ పని తీరును ఎండగట్టడానికే వచ్చాం
- నేడు ప్రధాని, బీజేపీ నేత సుష్మతో భేటీ
- ఢిల్లీలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి


k talangana patrika telangana culture telangana politics telangana cinemaన్యూఢిల్లీ, సెప్టెంబర్ 30 (టీన్యూస్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకునేంత వరకూ సకల జనుల సమ్మె ఆగబోదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమాన్ని నిరంకుశంగా అణచివేయడానికి ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టడానికే ఇక్కడికి వచ్చామని తెలిపారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ కే స్వామిగౌడ్‌పై పోలీసుల హత్యాయత్నం, ఎమ్మెల్యేలపై భౌతిక దాడులను ప్రస్తావించిన కేసీఆర్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు.

గత 18 రోజులుగా శాంతియుతంగా సాగుతున్న సకల జనుల సమ్మె పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీసు అధికారుల తీరును ప్రధాని, ప్రతిపక్ష నేతల దృష్టికి తీసుకు తాము వచ్చామని చెప్పారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రధానిని డిమాండ్ చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ సహా ఇతర ముఖ్యనేతలను కూడా కలుస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం తప్ప తమకు మరో ఆశ లేదన్నారు. పండుగలు పబ్బాలు వచ్చినా తెలంగాణ సాధించుకునేంత వరకూ సకల జనుల సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ స్వామిగౌడ్ మాట్లాడుతూ సమ్మె ఉహించని రీతిలో విజయవంతమవుతున్నదని అన్నారు.

ఈ విషయాన్ని తట్టుకోలేని ప్రభుత్వం నిరాశతో ఉద్యమ నాయకులను అంతం చేయాలని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలిచ్చిందన్నారు. ఉద్యోగుల అంతు చూస్తానని బెదిరించిన లగడపాటిని ప్రశ్నిద్దామనుకున్న ఎమ్మెల్యేలు, ఉద్యోగ నాయకులను పోలీసులు చితక్కొట్టారని చెప్పారు. ప్రభుత్వం మఫ్టీ పోలీసులను పెట్టి మరీ ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. తనపై జరిగిన దాడిపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్వామిగౌడ్ తెలిపారు. తెలంగాణ ప్రజలంతా ఒకే గొంతుతో ఉద్యమిస్తున్న సమయంలో ఉద్యమాన్ని ప్రభుత్వం హింసవైపు మళ్లించడానికి కుట్ర పన్నిందని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ మండిపడ్డారు.

స్వామిగౌడ్‌పై దాడే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వీటన్నింటినీ ప్రధాని, రాష్ట్రపతి, జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై చర్యలు చేప వరకూ ఊరుకోబోమని హెచ్చరించేందుకే ఢిల్లీ వచ్చామని తెలిపారు. ఉద్యోగ సంఘ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన వెలువరించేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఢిల్లీ విమానాక్షిశయంలో అడుగుపెట్టగానే జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది.

No comments:

Post a Comment