
సెప్టెంబర్ 17ను గత కొద్ది కాలంగా భారతీయ జనతా పార్టీ వంటివి
తెలంగాణా విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నాయి. భారత దేశానికి 1947 ఆగస్ట్
15 నాడు స్వతంత్రం వస్తే తెలంగాణా ప్రజలు ఒక నామమాత్రపు స్వతంత్రం
పొందడానికి 1948 సెప్టెంబర్ 17 వరకూ ఎదురుచూడాల్సి వచ్చింది.
నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరుకు బీజేపీ మతం
రంగు పులమడం సరికాదు. అప్పటి ప్రభువు ముస్లిం అవడం, మజ్లీస్ ఇత్తెహాదుల్
ముస్లిమీన్ (రజాకార్) ను స్థాపించి ముస్లిములను ఆకర్షించే ప్రయత్నం చేయడం
నిజమే. అయితే సామాన్య ప్రజల్లో ఎనలేని మతసామరస్యం నెలకొల్పింది సాయుధ
పోరాటం. ఆనాటి పోరాటం ముస్లిం రాజుకు తొత్తులుగా ఉన్న హిందూ దొరలకు
వ్యతిరేకంగా మొదలైంది. తదనంతర కాలంలో ఈ దొరలకు మద్ధతుగా నిలబడింది ముస్లిం
రజాకార్లు. ఇక పోరాటంలో పాల్గొని, దానికి అనుకూలంగా ఉన్న వారిలో బందగీ,
ముఖ్దూం మొహియుద్దీన్, షోయబుల్లా ఖాన్ వంటి ఎందరో ముస్లిములున్నారు.
షోయబుల్లా ఖాన్ అనే పాత్రికేయుడినయితే నిజాంకు వ్యతిరేకంగా రాసినందుకు
చేతులు నరికి చంపారు రజాకార్లు.

భూమికోసం, భుక్తి కోసం, బానిసత్వం నుండి
విముక్తి కోసం ఆనాడు తెలంగాణా ప్రజలు జరిపిన సాయుధ పోరు ప్రపంచ చరిత్రలో
శిలాక్షరాలతో లిఖించదగ్గది. తదనంతరం జరిగిన అనేకానేక పరిణామాల వల్ల ఆ మహనీయ
పోరాటం మరుగునపడింది.
ఇంతటి గొప్ప పోరాటం జరిపి ప్రజలు సాధించిన
విజయాన్ని తక్కువచేసి, భారత సైన్యం జరిపిన సైనిక దాడిని ఎక్కువ చేసి చూపడం,
ఆనాటి పోరాట యోధులకు కనీసం పించనులు ఇవ్వకుండా చేసి, ఇప్పుడు సర్దార్
వల్లభాయ్ పటేల్ పటాలకు దండలు వేస్తున్న భాజపా పార్టీ వారు ఒక విధంగా
చరిత్రను వక్రీకరిస్తున్నట్టే.
1946లో హైదరాబాద్ సంస్థానంలోని భూస్వాములపై
మొదలైన పోరు అటు తరువాత నిజాం కిరాయి సైన్యం రజాకార్ల పైనా, 1948
సెప్టెంబర్ 17 అనంతరం భారత సైన్యంపైనా కొనసాగింది.
బాంచన్ నీ కాల్మొక్తా అని దొరల కింద బానిసలుగా
బ్రతుకుతున్న తెలంగాణా రైతుల్లో పోరాటం చేయాలనే స్పూర్తిని రగిలించింది
మొదలు ఆంధ్ర మహాసభ అయితే ఆ పోరాటాన్ని సాయుధం చేసింది భారత కమ్యూనిస్టు
పార్టీ.

తెలంగాణా సాయుధ రైతాంగ పోరుపై బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్ వేసిన చిత్రం
వరంగల్ జిల్లా పాలకుర్తి అనే గ్రామం లో చాకలి
అయిలమ్మ అనే మహిళ పంటను అక్కడి దొర గూండాలు బలవంతంగా లాక్కోవాలని
చూసినప్పుడు ఈ పోరాటం సాయుధ రూపం తీసుకుంది. 1946 జూన్ లో కడివెండి అనే
గ్రామం లో నిజాం అధికారులు లెవీ ధాన్యం ఇళ్లమీదపడి దోచుకుంటుండగా స్థానిక
సంఘం సభ్యులు తిరగబడ్డారు. ఆనాటి పోరులో దొడ్డి కొమురయ్య నేలకొరిగాడు. అదే ఈ
పోరాటం లో తొలి బలిదానం.
అది మొదలు 1951 లో పోరాటం నిలిపివేసేంతవరకూ నాలుగు వేల పైచిలుకు తెలంగాణా ముద్దు బిడ్డలు ఈ పోరులో అమరులయ్యారు.
తెలంగాణా సాయుధ పోరాటం ప్రజల్లో తీసుకు వచ్చిన చైతన్యం
అపారమైనది. పోరాట కాలంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక వేల మంది జమీందార్ల, దొరల
భూమి పేదవారికి పంచారు. అయితే 1948 సెప్టెంబర్ 17 అనంతరం హైదరాబాద్
రాష్టంలో పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.

స్వతంత్రం రాగానే హైదరాబాద్ రాష్ట్రాన్ని
విముక్తం చేయవలసిన అప్పటి భారత ప్రభుత్వం నిజాంతో యధాతధ ఒప్పందం
కుదుర్చుకుంది. ఓ వైపు సాయుధ పోరులో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే వినోదం
చూసింది. చివరకు సాయుధ పోరు తీవ్రమై ఇక హైదరాబాద్ రాష్ట్రం కమ్యూనిస్టుల
పరం అవుతుందని భయం కలిగాకే భారత సైన్యం రంగంలోకి దిగింది. అయితే హైదరాబాద్
రాష్ట్రంపై సైనిక చర్య మొదలు కాకముందే, హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాం నుండి
విముక్తి చేయడం అనకుండా ప్రజల తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టుల నుండి
విముక్తి చేయడం అని ప్రకటించుకున్నారు మన వల్లభాయ్ పటేల్ వంటి వారు.
సైనిక చర్య సంధర్భంగా, ఆ తరువాత హైదరాబాద్
రాష్ట్రంలో జరిగిన పరిణామాలు చూసి ఇక్కడి ప్రజలు “స్వతంత్రం అంటే ఇలా
ఉంటుందా” అని ఆశ్చర్యచకితులయ్యారు.
వస్తూ వస్తూనే వేలాది మంది ముస్లిములను ఊచకోత
కోశారు భారత సైనికులు. ఇక తెలంగాణాలో, పోరాటానికి అండగా నిలిచిన కృష్ణా,
గుంటూరు జిల్లాలలో సైన్యం చేసిన అత్యాచారాలు చూసి సభ్య సమాజం సిగ్గుతో
తలదించుకుంది. ప్రజలపై అత్యాచారాల్లో రజాకార్లను మించిపోయారు వీరు. కృష్ణా
జిల్లాలోని కాటూరు, ఎలమర్రు గ్రామాలో వందలాది స్త్రీ, పురుషులను గుడ్డలు
ఊడదీసి గాంధీ విగ్రహం చుట్టూ ప్రదర్శన చేయించారు.

సాయుధ పోరాటం ధాటికి పల్లెలు వదిలేసి పట్నం
చేరిన దొరలు, హైదరాబాద్ రాష్ట్రం భారత దేశంలో విలీనం కాగానే గాంధీ టోపీలు
పెట్టుకుని కాంగ్రెస్ నేతల అవతారం ఎత్తి గ్రామాలకు తిరిగివచ్చారు. ప్రజలు
ఆక్రమించుకున్న భూములను మిలిటరీ సాయంతో తిరిగి చేజిక్కించుకున్నారు. ఈ
కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను
భారత సైనికులు పిట్టలను కాల్చినట్టు కాల్చేశారు. తెలంగాణా ప్రాంతంలో
నిజాంపై పోరాటం జరిగిన కాలంలో ఎంతమంది చనిపోయారో దాదాపు అంతే మంది భారత
సైన్యం చేతిలో చనిపోవడం గమనార్హం.
ఇక అన్నిటికన్నా ఘోరమైన విషయం మరొకటి ఉంది.
సాయుధ పోరాటంలో భాగంగా నిజాం ప్రభుత్వం అనేక మంది కార్యకర్తలు అరెస్ట్ చేసి
కేసులు పెట్టింది. హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో కలిసిపోయాక ఆ కేసులను భారత
ప్రభుత్వం విచారించింది. నిజాంపై పోరాటం చేసినందుకుగాను దాదాపు యాభై
మందికి ఉరిశిక్ష వేసి పాలకులు ఎప్పుడూ పాలకుల్లాగే ఉంటారని నిరూపించింది మన
ప్రభుత్వం. భారతదేశంలో కలిస్తే తమ కష్టాలు గట్టెక్కుతాయని తలచిన అమాయక
తెలంగాణా ప్రజలు మొదటి సారి విస్మయానికి గురయ్యారు ఈ అన్యాయమైన ఉరిశిక్షల
గురించి తెలుసుకుని.
ఈ ఉరిశిక్షల వార్త విని ప్రపంచం నలుమూలల నుంచీ
తీవ్ర నిరసన వ్యక్తం అయ్యింది. ఉరిశిక్ష పడ్డవారిలో నిండా 15 యేళ్లు లేని
రాంరెడ్డి ఫోటో అప్పటి అమెరికన్ పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. పాల్
రాబ్సన్, పాబ్లో నెరూడా వంటి అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన గాయకులు, రచయితలు
ప్రధాని నెహ్రూకు లేఖలు రాశారు. వందలాది టెలిగ్రాములు, ఉత్తరాలు
ప్రభుత్వాన్ని ముంచెత్తాయి. చివరికి ఈ కేసును వాదించడానికి లండన్ నుండి డీ.
ఎన్. ప్రిట్ అనే ఆంగ్లేయ న్యాయవాది వచ్చాడు. అనేక నెలలు జరిగిన ఈ విచారణ
1951 మే లో సుప్రీం కోర్టు ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షగా మార్చడంతో
ముగిసింది.
No comments:
Post a Comment