Pages

Sunday, September 4, 2011

Chalk Piece

ఈ దీపం వెలుతురులో
ఎందరో డాక్టర్లూ, ఇంజనీర్లయ్యారు
ఈ కాంతి క్షేత్రంలోనే
మరెందరో ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ తయారయ్యారు
దీని రంగు తెలుపు
దీని కాంతి తెలుపు
ఆయుః ప్రమాణం కాస్త అటో ఇటో అరవై నిముషాలు
ఇదొక దండి దండాయస్కాంతం
దీన్ని వేళ్ల మధ్య వేలాడ దీయనక్క లేదు
కొంచెం అదిమి పడితే చాలు
విద్యార్థులకు ఉత్తర దక్షిణాలే కాదు
సమస్తమైన దిక్కుల్ని నిర్దేశించగల చుక్కాని
తరగతి గదికి వెళ్ళే ఉపాధ్యాయులకు ఊపిరి గుళిక
ఉపన్యాసకులకు ఊతకర్ర
నల్లని బోర్డు ఆకాశంలో
అలా అలవోకగా అక్షరాల్ని కురిపిస్తూ
హాయిగా చల్లగా తెల్లగా సాగిపోయే ఓ మేఘ శకలం
జ్ఞాన మానస సరోవరంలో తేలియాడే రాజహంస
తన దేహం నిలువెల్లా ముక్కలు, ముక్కలుగా తెగిపడుతున్నా
తనువులోని అణువణువూ క్షణక్షణం నేల రాలిపోతున్నా
ఆత్మబలిదానం తప్ప అన్యమెరుగని త్యాగశీల
కదలని బోర్డు ఇరుసుపై కదిలే శీల
ఇది గురువుగారి వేళ్ల మధ్య
కాలిపోతున్న సిగరెట్టులా కాదు
కొవ్వొత్తిలా కరిగిపోతూ
మంచుముక్కలా అరిగిపోతూ
ఫిలమెంటులా వెలిగిపోతూ
సుద్ద మొద్దుల్ని సైతం తీర్చిదిద్దే
పరిశుద్ధమైన సుద్దముక్క!
రచన : డా. నలిమెల భాస్కర్

No comments:

Post a Comment