Pages

Friday, September 16, 2011

Analysis on Congress Status in Telangana Region

తెలంగాణలో కాంగ్రెస్‌కు చావుదెబ్బే
- బాన్సువాడలో పోటీ చేస్తే.. డిపాజిట్ గల్లంతు
- టీ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నా పోటీకి అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్
- బొత్స వ్యతిరేకించినా సీఎం ఒత్తిడితో హైకమాండ్ నిర్ణయం
- పీసీసీ చీఫ్ మాటకు లేని విలువ
- 2010 ఉప ఎన్నికల ఫలితాలే పునరావృతం?
- తెలంగాణకు సానుకూల ప్రకటన చేస్తే తప్ప కాంగ్రెస్ బతికి బట్టకట్టదు..
- టీ కాంగ్రెస్ నేతల విశ్లేషణ


హైదరాబాద్, సెప్టెంబర్ 14 (టీ న్యూస్):బాన్సువాడ ఉప ఎన్నిక ఫలితాలు తెలంగాణలో కాంగ్రెస్‌ను చావుదెబ్బ తీయనుందా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. తెలంగాణ వాదంతో వచ్చిన ఈ ఉప ఎన్నిక తెలంగాణ వ్యతిరేకులకు గుణపాఠం నేర్పనున్నాదా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటులో కుంటి సాకులు చూపిస్తూ, నాన్చుడు ధోరణి అవలంభిస్తున్న అధికార కాంగ్రెస్‌పై, రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న టీడీపీపై తెలంగాణ ప్రాంత ప్రజలు భగ్గుమంటున్నారు. ఉప ఎన్నికలో ఆ పార్టీలకు డిపాజిట్లు గల్లంతు చేసి, తెలంగాణ దెబ్బ చూపించాలని నిర్ణయానికి వచ్చారు. అదే సమయంలో తెలంగాణ వాదులందరు ఏకమై తెలంగాణ కోసం రాజీనామా చేసిన పోచారం శ్రీనివాసడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై టీడీపీ తెలంగాణ ఫోరం తేల్చుకోలేక పోతోంది. ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసే వరకు ఆ పార్టీ ఒక నిర్ణయానికి రానున్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్ధమని ఇప్పటికే ప్రకటించింది.

బాన్సువాడలో పోటీ చేస్తామంటూ పీసీసీ అధ్యక్షుడు బొత్స తాజాగా బుధవారం ఢిల్లీలో పునరుద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్న తరుణంలో సానుకూల ప్రకటన చేయకుండా ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కనుక ఈ ఎన్నికల్లో పోటీ చేస్తే, ఆ పార్టీ పరిస్థితి తయారు కావడం ఖాయం అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 2010లో తెలంగాణ వాదంతో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవమే మరోసారి ఎదురవుతుందని తెలంగాణ నేతల్లో ఆందోళన నెలకొంది. డిపాజిట్ సైతం దక్కని పరిస్థితి పునరావృతమవుతుందన్న భయం వారిని వెన్నాడుతోంది. అలాగే పీసీసీ అధ్యక్షుడి హోదాలోపోటీ చేసిన డి.శ్రీనివాస్‌కు కూడా డిపాజిట్ కోల్పోవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణవాదం బలంగా ఉందని, సెంటిమెంట్‌కే ఓటు పడే పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పోటీ చేస్తే నియోజకవర్గ ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ డిపాజిట్ కోల్పోతే అవమానంగా ఉంటుందని వారు వాదిస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను గుర్తించిన పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మొదట పోటీని వ్యతిరేకించారు. పోటీ చేయకుండా ఉంటే తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవించినట్లు ఉంటుందని చెప్పారు. అధిష్ఠానం వద్ద కూడా ఇదే వాదన వినిపించించారు. మరో వైపు ిసీఎం కిరణ్‌కుమార్‌డ్డి మాత్రం ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయాలంటూ పట్టుబట్టారు. పోటీ చేయకుంటే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళుతాయని కిరణ్ తన వాదన వినిపించారు. దీంతో సీఎం కిరణ్ మాటకే విలువ ఇస్తూ పార్టీ అధిష్ఠానం పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


కిరణ్ ఒత్తిడి, అధిష్ఠానం నిర్ణయం మేరకే బొత్స బాన్సువాడ ఎన్నికల్లో పోటీ విషయాన్ని హస్తినలో అధికారికంగా ప్రకటించారు. దీంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఇచ్చిన రీతిలోనే ప్రస్తుత సీఎంకు అధిష్ఠానం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. పీసీసీ చీఫ్‌తో తనకు సమన్వయం బాగానే ఉందని, విభేదాలు లేవంటూ సీఎం చెబుతున్న మాటలకు ఆచరణకు పొంతన ఉండటం లేదు. బొత్స మాటకు సీఎం ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో వంట గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇద్దామని, సామాన్యులపై భారం పెరగకుండా ఆర్జీసీ ఛార్జీలు పెంచాలని పీసీసీ చీఫ్ హోదాలో చేసిన తొలి ప్రతిపాదనకు సీఎం ఏమాత్రం విలువ ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా బాన్సువాడ ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండటమే ఉత్తమమని బొత్స ఎంత చెప్పినా పట్టించుకోలేదు. దీంతో పీసీసీ చీఫ్ బొత్సకు- సీఎం కిరణ్‌కు మధ్య దూరం పెరుగుతున్నదనడానికి ఈ ఘటనలే నిదర్శనమని పార్టీ వర్గాలంటున్నాయి.

No comments:

Post a Comment