Pages

Friday, September 16, 2011

Singareni shock to government on Telangana separate statehood

కరంట్ కోతలే
- సర్కారుకు సింగరేణి షాక్!
- మరో మూడు రోజుల్లో అంధకారం!
- బొగ్గు సరఫరా బంద్
- నేడు రామగుండం ఎన్టీపీసీ మూత!
- పీఎల్‌ఎఫ్‌ను తగ్గించుకుంటున్న ఎన్టీపీసీ, జెన్‌కో
- బొగ్గు కోసం ఛత్తీస్‌గఢ్ వైపు చూపులు
- తెలంగాణ సత్తా చాటుతున్న నల్ల సూరీళ్లు


boggu-telangana-News talangana patrika telangana culture telangana politics telangana cinemaహైదరాబాద్, సెప్టెంబర్ 15 (టీ న్యూస్):తెలంగాణ కోసం సకల జనుల సమ్మెలో మూడు రోజులుగా సింగరేణి కార్మికులు పాల్గొంటుండటంతో సీమాంధ్ర సర్కారు విలవిలలాడిపోతోంది. గనిలో బొగ్గు తవ్వకాలు జరగకపోవడం, బొగ్గు నిల్వలు దాదాపు ఖాళీ అవడంతో కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎన్టీపీసీ యూనిట్లు, ఏపీ జెన్‌కో పరిధిలోని థర్మల్ పవర్ యూనిట్లు మూతపడే పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా 65.36 మిలియన్ యూనిట్ల మేరకు ఉన్న జలవిద్యుత్ ఉత్పిత్తి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో సర్కారు దిక్కులు చూస్తోంది. తెలంగాణ కోసం ఇదే రీతిలో కార్మికులు సమ్మె కొనసాగిస్తే మరో మూడు రోజుల్లో రాష్ట్రం మొత్తం విద్యుత్ నిలిచిపోయి, చీకట్లో ఉండాల్సిన పరిస్థితి తప్పదన్న సంకేతాలు ప్రభుత్వానికి అందుతున్నాయి. దీంతో అధికారికంగా కరెంటు కోతలను అమలుచేయాలని సీమాంధ్ర పాలకులు నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటలు, మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, జిల్లా కేంద్రాల్లో రెండు గంటల చొప్పున బుధవారం నుంచే కరెంటు కోతలు అమలులోకి తెచ్చారు. గురువారం రాష్ట్రంలో 242 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ నెలకొనగా థర్మల్, హైడల్, గ్యాస్ ప్రాజెక్టుల నుంచి 241 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరిగింది. 2,600 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని బొగ్గు కొరత కారణంగా శుక్రవారం నాటికి పూర్తిగా మూసివేయనున్నారు. రామగుండంలో బుధవారం నాటికే 1400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది.

బొగ్గు కోసం ఛత్తీస్‌గఢ్‌కు...
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ఏపీ జెన్‌కో చేష్టలుడిగినట్లుగా ఉన్న బొగ్గు నిల్వలను కాపాడుకుంటూ విద్యుత్ ఉత్పిత్తి చేస్తుండగా, ఏపీ ట్రాన్స్‌కో విద్యుత్ కోతలను అమలుచేస్తూ జాగ్రత్త చర్యల్లో నిమగ్నమైంది. పరిస్థితుల తీవ్రతను గర్తించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదక సామర్థ్యం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్)ను 75 శాతానికి తగ్గించుకోవాలని అధికారికంగా నిర్ణయించాయి. ఈ మేరకు ఎన్టీపీసీ నుంచి అధికారికంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్‌లో కేవలం ఐదు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు ఉండటం, సింగరేణి నుంచి రామగుండం యూనిట్‌కు బొగ్గు లభ్యత సాధ్యం కాదని నిర్ధారించుకున్న ఎన్టీపీసీ ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా యూనిట్ నుంచి రామగుండంకు బొగ్గును తరలించే ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. బొగ్గు రవాణాలో అంతరాయం ఏర్పడకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని ఎన్టీపీసీ కోరినట్లు సమాచారం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూలం స్పందన లభించినట్లు తెలిసింది. గురువారం రాత్రి నుంచి భద్రత ఏర్పాట్ల మధ్య బొగ్గు నిల్వలను ఒక చోటి నుంచి మరొక చోటికి తరలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏపీ జెన్‌కో పరిధిలోని థర్మల్ స్టేషన్లలో బొగ్గు నిల్వలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

గురువారం సాయంత్రం నాటికి కేటీపీఎస్‌లో రెండున్నర రోజులకు సరిపడే బొగ్గునిల్వలు(5,6వ యూనిట్లు) మాత్రమే ఉన్నాయి. రాయలసీమలోని ఆర్టీపీపీలో మాత్రం పదకొండు రోజులకు సరపోను బొగ్గు అందుబాటులో ఉంది. కేటీపీపీ(భూపాలపల్లి, వరంగల్) కేందాల్లో పదహారు రోజులకు సరిపడే నిల్వలున్నాయి. రాష్ట్రానికి అదనంగా లక్ష టన్నుల బొగ్గును తీసుకువచ్చే ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. మహనంది కోల్ ఫీల్డ్ నుంచి ఐదు ర్యాక్‌ల బొగ్గు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షణాది గ్రిడ్ నుంచి ఎక్కువ విద్యుత్ సరఫరా కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నాయి. గ్యాస్ ఆధారిత పవర్ ప్రాజెక్టులకు నూరు శాతం గ్యాస్ అందించే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని యోచిస్తున్నారు. సర్కారు ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా తమ సమ్మె ఆగదని, తెలంగాణ వచ్చేదాకా పోరాడుతామని సింగరేణి కార్మికులు తేల్చిచెబుతున్నారు. తెలంగాణ ఇస్తే ఇలాంటి సమస్య ఉండదని సూచిస్తున్నారు.

No comments:

Post a Comment